బ్రేకప్ చెప్పిన ప్రియుడికి... ఉల్లిపాయలతో పగ తీర్చుకుంది!

20-05-2020 Wed 06:44
  • ఏదాడి ప్రేమ తరువాత బ్రేకప్ చెప్పిన ప్రియుడు
  • 1000 కిలోల ఉల్లిపాయలను డోర్ డెలివరీ చేయించిన ప్రేయసి
  • సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు వైరల్
Lover Retaliation for Breakup Goes Viral

తనను నమ్మించి.. ప్రేమలో దించి.. కల్లబొల్లి కబుర్లు చెప్పి.. ఆనక ముఖం చాటేసిన దొంగ ప్రియుడికి ఓ అమ్మాయి విభిన్నంగా బుద్ధి చెప్పింది. అతన్ని కూడా ఏడిపించాలన్న కసితో, కోపంతో ఆమె చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఆ వివరాల్లోకి వెళితే, చైనాలోని జిబో ప్రాంతంలో దాదాపు ఏడాదికి పైగా ప్రేమించిన తరువాత ఓ యువకుడు, తన ప్రేయసి జావోకు బ్రేకప్ చెప్పాడు. దీంతో ఆమె గుండె పగిలింది. మూడు రోజుల పాటు ఏడ్చింది. తనకు బ్రేకప్ చెప్పిన తరవాత ఏ మాత్రమూ బాధపడకుండా ఉన్నాడని ఆగ్రహంతో రగిలిపోయింది. అతన్ని ఏడిపించాలన్న ఆలోచనతో ఏకంగా 1000 కిలోల ఉల్లిపాయలను అతనింటికి డోర్ డెలివరీ చేయించింది.

అతన్ని కలవకుండా, అతనికి తెలియకుండా, ఉల్లిపాయల మొత్తాన్ని ఇంటి వద్ద వేసి రావాలని డెలివరీ సంస్థకు చెప్పింది. "నేను మూడు రోజుల పాటు ఏడ్చాను. ఇక నీ వంతు" అంటూ ఓ మెసేజ్ ని కూడా పంపింది.

ఇక తన ఇంటి ముందున్న ఉల్లిపాయలను ఏం చేయాలో తెలియక సదరు యువకుడు బిత్తరపోయి చూస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. జరిగిన ఘటనపై స్పందిస్తూ, ఆమెకు పొగరు ఎక్కువని, నాటకాలు ఆడుతోందని మండిపడ్డాడు. బ్రేకప్ చెప్పిన తరువాత తాను కూడా బాధపడ్డానని అన్నాడు.