Cyber Virus: కరోనా సమాచారం మాటున క్రెడిట్ కార్డు వివరాలు దొంగిలిస్తున్న సైబర్ వైరస్

  • రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సీబీఐ
  • 'సెర్బెరస్' పేరుతో కొత్త వైరస్
  • కరోనా అప్ డేట్స్ పేరిట ఫోన్లలో చొరబాటు
New cyber virus attacks and steals credit card details

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఓ సైబర్ వైరస్ సాయంతో క్రెడిట్ కార్డు వివరాలు తస్కరిస్తూ ఇంటర్నెట్ లో కలకలం సృష్టిస్తున్నారు. భారత్ లోనూ దీన్ని గుర్తించిన సీబీఐ ఈ మేరకు రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను, ఇతర సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పేరు 'సెర్బెరస్' అని, ఇది ప్రధానంగా ఆర్థిక సంబంధ సమాచారం దొంగిలిస్తోందని వివరించింది. దీని గురించి ఇంటర్ పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందింది.

కరోనా వైరస్ కు సంబంధించిన అప్ డేట్స్ ముసుగులో ఇది స్మార్ట్ ఫోన్లలో ప్రవేశించి పని చక్కబెట్టుకుంటోందని సీబీఐ పేర్కొంది. కరోనాపై తాజా సమాచారం కావాలా అంటూ టెక్ట్స్ మెసేజ్ వస్తుందని, దాంట్లో ఉన్న లింకును క్లిక్ చేస్తే వెంటనే ఓ ప్రమాదకర యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేస్తుందని, అక్కడ్నించి ఫోన్ లో ఉన్న సమస్త కీలక సమాచారం హ్యాకర్ల చేతికి చేరుతుందని సీబీఐ వివరించింది.  యూజర్లను బోల్తా కొట్టిస్తూ, రెండంచెల పాస్ వర్డ్ డీటెయిల్స్ ను కూడా కూపీ లాగే సత్తా ఈ 'సెర్బెరస్' వైరస్ సొంతం, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది.

More Telugu News