Kalapani: కాలాపానీ అనేది ఇండియా-నేపాల్ మధ్య సమస్య: చైనా

  • కాలాపానీ వ్యూహాత్మకంగా భారత్ కు చాలా కీలకం
  • ఇటీవలే చైనా సరిహద్దులకు ఆనుకుని ఉండే రోడ్డును ప్రారంభించిన భారత్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్
Kalapani is an issue between India and Nepal says China

ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న కాలాపాని వివాదాన్ని ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. ఈ వివాదానికి సంబంధించి దూకుడుగా వ్యవహరించవద్దని కోరింది. కాలాపానీ ప్రాంతంలో భారత్ కొత్తగా ప్రారంభించిన రహదారిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని... దీని వెనుక మరెవరో ఉన్నారంటూ చైనాపై పరోక్షంగా ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... డ్రాగన్ దేశం ఈ మేరకు స్పందించింది.

చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ, కాలాపానీ అనేది ఇండియా, నేపాల్ దేశాల మధ్య ఉన్న సమస్య అని చెప్పారు. స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. దూకుడుగా వ్యవహరిస్తే వివాదం మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు.

భారత్ ప్రారంభించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా భారత్ కు ఎంతో కీలకమైనది. దాదాపు 80 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి ఉత్తరాఖండ్ లో చైనా సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. అయితే, ఈ రోడ్డుకు సంబంధించి నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి కాలాపానీ ప్రాంతం తమదని ఆ దేశం వాదిస్తోంది. భారత్ చర్యలు తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని అంటోంది.

More Telugu News