సత్ఫలితాలు ఇస్తున్న కరోనా వ్యాక్సిన్.. అమెరికాలో ప్రయోగాలు!

19-05-2020 Tue 14:48
  • ఇప్పటికే తొలి దశ ప్రయోగాలు పూర్తి
  • ఎనిమిది మంది ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్
  • వారిలో యాంటీబాడీలు తయారైనట్టు గుర్తించిన పరిశోధకులు
US made vaccine gives better results against corona

ఓవైపు కరోనా తన పని తాను చేసుకుంటూ పోతుండగా, దాని అంతం చూసే వ్యాక్సిన్ తయారీలో పరిశోధకులు తలమునకలుగా ఉన్నారు. ఈ విషయంలో అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ ముందంజ వేసింది. ఈ సంస్థ ఆవిష్కరించిన వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. వైరస్ కు వ్యతిరేకంగా శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పరిశోధకులు అంటున్నారు.

ఇప్పటికే మానవులపై తొలి దశ ప్రయోగాలు మొదలయ్యాయి. మార్చిలో 8 మంది ఆరోగ్యవంతులపై ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించి చూడగా, వారిలో యాంటీబాడీలు ఉత్పన్నమవడాన్ని గుర్తించారు. అంతేకాదు, ఆ యాంటీబాడీలు కరోనా వైరస్ కణాల ప్రత్యుత్పత్తిని కూడా అడ్డుకుంటున్నాయని పరిశోధనలో ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది.

ఓ వ్యాక్సిన్ లో ఇదే కీలక అంశమని, రెండో దశలో 600 మందిపై త్వరలోనే ప్రయోగాలు ఉంటాయని మోడెర్నా సంస్థ పేర్కొంది. జూలైలో నిర్వహించబోయే మూడో దశలో వేలాదిమంది ఆరోగ్యవంతులపై ప్రయోగించి చూస్తామని వెల్లడించింది. అటు, ఎఫ్ డీయే (అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) కూడా రెండో దశ ప్రయోగాలకు అనుమతి ఇవ్వడంతో మోడెర్నా సంస్థ పరిశోధకుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమైంది.