ఏపీ వ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు నాయుడు పిలుపు

19-05-2020 Tue 12:14
  • ఈ నెల 21న నిరసనలు
  • అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో పాల్గొనాలి
  • ఇళ్లలోనే ఉండి నిరసనలు చేపట్టాలి
  • విద్యుత్ ఛార్జీలను దాదాపు నాలుగు రెట్లు పెంచడం దారుణం
chandrababu fires on ap govt

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడి సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాకుండా, విద్యుత్‌ ఛార్జీలు పెంచి మరిన్ని కష్టాల్లోకి నెట్టేసిందంటూ విమర్శలు గుప్పిస్తోన్న టీడీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు సూచించారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ఇళ్లలోనే ఉండి నిరసనలు చేపట్టాలన్నారు. విద్యుత్ ఛార్జీలను దాదాపు నాలుగు రెట్లు  పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే దేశంలోని డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్ల రాయితీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో విద్యుత్ ధరలు పెంచడమేంటని నిలదీశారు.