Nara Lokesh: అమ్మ వయస్సు ఉన్న వారిపై కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు!: జగన్ పై లోకేశ్ విమర్శలు

  • విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై సర్కారుకి వ్యతిరేకంగా పోస్టులు
  • గుంటూరులో ఓ వృద్ధురాలిపై కేసులు
  • ఇది వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శ
lokesh fires on ycp leaders

విశాఖ గ్యాస్‌లీక్‌ ఘటనపై సర్కారుకి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు‌ పెట్టారంటూ గుంటూరులో ఓ వృద్ధురాలిపై సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన పూందోట రంగనాయకమ్మ(66)కు సోమవారం సీఐడీ సీఐ దిలీప్‌కుమార్‌ నోటీసు అందజేయడంపై లోకేశ్ మండిపడ్డారు.

'అమ్మ వయస్సు ఉన్న వారిని కూడా కక్షగట్టి, వెంటాడి వేధిస్తున్నారు వైఎస్ జగన్‌. ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ తో అమాయకుల ప్రాణాలు బలిగొన్న కంపెనీ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చెయ్యలేదు' అని తెలిపారు.

'ప్రమాదంలో చిన్నారిని కోల్పోయిన బాధలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను అరెస్ట్ చేసి అదో గొప్ప కంపెనీ అంటూ కితాబిచ్చారు జగన్. గ్రామస్థులు లేవనెత్తిన ప్రశ్నలనే సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు రంగనాయకమ్మ గారిపై కేసు పెడతారా?' అని నిలదీశారు.

'66 ఏళ్ల వృద్ధురాలిపై కేసు పెట్టడం వైకాపా ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. మీ లెక్క ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష అయితే, 43 వేల కోట్ల ప్రజల సొమ్ము కొట్టేసిన జగన్ గారికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష వెయ్యాలి?' అని ఆయన ప్రశ్నించారు.

More Telugu News