YSRCP: అత్యధిక విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీల్లో దేశంలో రెండో స్థానంలో వైసీపీ!

  • 2018-19 ఆర్థిక సంవత్సర నివేదికలో వెల్లడి
  • 23 పార్టీలకు మొత్తం రూ.885.956 కోట్ల విరాళాలు
  • జేడీఎస్‌కు తెలియని మార్గాల నుంచి దేశంలోనే అత్యధిక విరాళాలు
  • ఈ జాబితాలో ఐదో స్థానంలో టీడీపీ 
ysrcps donations

దేశంలోని రాజకీయ పార్టీలకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.885.956 కోట్ల విరాళాలు వచ్చాయి. తెలియని మార్గాల నుంచి అత్యధిక విరాళాలు వచ్చిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఈ జాబితాలో టీడీపీ ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా, కేంద్ర ఎన్నికల సంఘానికి దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన విరాళాల విషయంపై‌ నివేదికలు సమర్పించాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ ఆ వివరాలు తెలిపింది.

ఆ 23 పార్టీలకు మొత్తం రూ.885.956 కోట్ల విరాళాలు వచ్చాయి. వాటిల్లో రూ.481.276 కోట్ల విరాళాలు గుర్తు తెలియని మార్గాల నుంచి వచ్చాయి. ఇలా తెలియని మార్గాల నుంచి అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో రూ.213.543 కోట్లతో ఒడిశాలోని బీజేడీ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వైసీపీకి ఈ మార్గంలో రూ.100.504 కోట్లు వచ్చాయి.

శివసేనకు రూ.60.73 కోట్లు, జేడీఎస్‌కు రూ.39.13 కోట్లు, టీడీపీకి రూ.37.78 కోట్లు వచ్చాయి. మరోవైపు, ప్రాంతీయ పార్టీలకు అధికంగా ఎలక్టోరల్  బాండ్ల రూపంలో రూ.436.99 కోట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు బాండ్ల రూపంలో రూ.141.5 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇతర విరాళాల గురించి ఆ పార్టీ  ఆడిట్  నివేదికలో రూ.41.175 కోట్లుగా చెప్పుకుంది. అయితే, ఎన్నికల సంఘానికి సమర్పించిన ఫామ్ 24లో మాత్రం రూ.41.275 కోట్లుగా చూపింది.

More Telugu News