యాక్సిడెంటల్ మినిస్టర్‌కు రాహుల్‌ను విమర్శించే అర్హత లేదు: పొన్నం ప్రభాకర్

19-05-2020 Tue 10:16
  • వలస కార్మికుల్లో మనో ధైర్యం నింపుతున్న రాహుల్‌పై విమర్శలు తగవు
  • ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడడం కాదు
  • ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం
ponnam prabhakar fires on nirmala sitharaman

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై ఆమె చేసిన విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. అనుకోకుండా మంత్రి అయిన ఆమెకు రాహుల్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.

పేదలకు, వలస కార్మికులకు అండగా నిలుస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న రాహుల్‌పై విమర్శలు తగవని హితవు పలికారు. ఏసీ రూముల్లో కాకుండా బయటకు వచ్చి చూస్తే వలస కార్మికుల వెతలేంటో అర్థమవుతాయన్నారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీ వల్ల పేదలకు ఒరిగేదేమీ లేదన్నారు. కరోనా వైరస్ మాటున కీలక రంగాలను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని పొన్నం ఆరోపించారు.