కశ్మీర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన తాలిబన్

19-05-2020 Tue 10:05
  • ఆ ప్రాంతం భారత్‌దే
  • ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము
  • పాక్‌కి మేము మద్దతివ్వట్లేదు
taliban on kashmir

కశ్మీర్‌పై ఉగ్రవాద సంస్థ తాలిబన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రాంతం భారత్‌దేనని, తాము ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. కశ్మీర్‌లో పాక్‌ చర్యలపై స్పందిస్తూ.. జిహాదీ పేరిట ఆ దేశం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి తాము మద్దతు ఇస్తామని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ తాలిబన్ నేత సుహైల్ షాహీన్  ఓ ప్రకటన చేశారు.

అలాగే, కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌కు, తాలిబన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాము చెప్పినట్లు వస్తోన్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో నిజం లేదని, తాము అలాంటి ప్రకటన విడుదల చేయలేదని చెప్పారు.

ఆయా దేశాల అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవద్దన్నది తాము ఓ విధానంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాగా, కశ్మీర్‌పై ఇటీవల తాలిబన్‌ ప్రకటన చేసినట్లు వచ్చిన వార్తలను భారత్‌ ఇప్పటికే కొట్టిపారేసింది. ఇప్పుడు అదే విషయంపై తాలిబన్‌ కూడా స్పందిస్తూ దానిపై స్పష్టతనిచ్చింది.