సైక్లింగ్ చేస్తూ... గండిపేట గుట్టల్లో శవమై తేలిన అమెరికన్!

19-05-2020 Tue 08:26
  • గచ్చిబౌలి ప్రాంతంలో భార్యతో నివాసం 
  • బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పాల్
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
US Citizen Died Near Gandipet

సైక్లింగ్ చేస్తున్న ఓ అమెరికా యువకుడు గండిపేట గుట్టల్లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, యూఎస్ కు చెందిన రాబర్ట్ పాల్ (38) తన భార్య ఏంజిలీనాతో కలిసి గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటూ, ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

వ్యాయామం నిమిత్తం సైకిల్ తీసుకుని వెళ్లిన అతను, తిరిగి ఇంటికి చేరకపోవడంతో, భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేయగా, అవి ఖానాపూర్ దగ్గరలోని గండిపేట రిజర్వాయర్ ప్రాంతంలో ఆగిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లగా, గండిపేట గుట్టల్లో పాల్ మృతదేహం కనిపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.