కరోనాతో హైదరాబాద్‌లో ఎస్‌బీఐ ఉద్యోగి మృతి.. భయంభయంగా ఉద్యోగులు!

19-05-2020 Tue 07:00
  • నిన్న మృతి చెందిన 57 ఏళ్ల వ్యక్తి
  • బాధితుడి కుటుంబ సభ్యులతోపాటు 60 మంది ఉద్యోగుల హోం క్వారంటైన్ 
  • బ్యాంకును శానిటైజ్ చేసిన అధికారులు
SBI Employee died with Coronavirus in Hyderabad

హైదరాబాద్, కోఠిలో ఓ బ్యాంకు ఉద్యోగి కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు. దీంతో ఆయన పనిచేసే బ్యాంకులోని వెయ్యిమంది ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన వ్యక్తి (57) కోఠి బ్యాంకు స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ లోకల్ హెడ్ ఆఫీసులోని కమర్షియల్ బ్రాంచ్‌లో మెసెంజర్‌గా పనిచేస్తున్నాడు.

 గత కొన్ని రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న అతడు సెలవులో ఉన్నాడు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అక్కడి వైద్యులు ఆయనను గాంధీకి రెఫెర్ చేశారు. దీంతో అక్కడికి వెళ్లి చూపించుకోగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు నిన్న మృతి చెందాడు.

అతడు మృతి చెందడంతో నింబోలి అడ్డా కామ్‌ఘర్‌నగర్‌లో నివసించే అతడి కుటుంబ సభ్యులతో పాటు ఎస్‌బీఐ కమర్షియల్ బ్రాంచ్‌లో అతడితో కలిసి పనిచేసే 60 మంది ఉద్యోగులను అధికారులు హోం క్వారంటైన్ చేశారు. మరోపక్క, తమ ఆఫీసులోని ఉద్యోగి ఇలా కరోనాతో మరణించడంతో, ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలోని కమర్షియల్ బ్రాంచ్‌లో పనిచేసే దాదాపు 1000 మంది ఉద్యోగులు భయంతో వణుకుతున్నారు. దీంతో, అధికారులు బ్యాంకును శానిటైజ్ చేయించారు.