AP DGP: నెల్లూరులో ఆరేళ్ళ చిన్నారితో పనులు... ఏపీ డీజీపీ వివరణ

  • నెల్లూరు జిల్లాలో ఘటన
  • పోలీసుల సమక్షంలో గదిని శుభ్రం చేసిన చిన్నారి
  • వెల్లువెత్తిన విమర్శలు
AP DGP responds on Child labour issue in Nellore district

నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారి గదిని శుభ్రం చేస్తుండగా, కొందరు పోలీసులు అక్కడే నిలుచుని చూస్తూ ఉండడం మీడియాలో కనిపించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. చిన్నారి పనులు చేయాల్సి రావడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాల కార్మిక నిషేధ చట్టం కింద ఈ ఘటనకు బాధ్యులు శిక్షార్హులని అభిప్రాయపడ్డారు.

3 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుందని, రూ.20 వేల వరకు జరిమానా విధిస్తారని సవాంగ్ వెల్లడించారు. బాలలతో పనులు చేయించడం చట్ట వ్యతిరేకమని ఎంతో ప్రచారం చేస్తున్నా గానీ ఇలాంటి చర్యలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పోలీసు శాఖలో సున్నితత్వం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, మీడియాలో చిన్నారితో పనులు చేయిస్తున్న దృశ్యాలు చూసిన వెంటనే డీజీపీ ఘటనపై విచారణ జరపాలంటూ నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు.

More Telugu News