KCR: తెలంగాణ వ్యవసాయానికి తిరుగులేదు: సీఎం కేసీఆర్

  • ఇక్కడి వాతావరణం అన్ని పంటలకు అనుకూలమన్న కేసీఆర్
  • ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదుగుతోందని వెల్లడి
  • ప్రతి రైతు లక్షాధికారి కావాలన్నదే తమ అభిమతమని వ్యాఖ్యలు
CM KCR tells about state agriculture

తెలంగాణలో వ్యవసాయానికి అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయని, ఇక్కడి నేలలకున్న వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడా లేదని, నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు, క్షార నేలలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ సమశీతోష్ణమండలంలో ఉన్నందున అన్ని రకాల పంటలు పండుతాయని వివరించారు.

900 మిల్లీమీటర్ల సగటు వర్షపాతంతో తెలంగాణలో వ్యవసాయానికి అన్నిరకాల అనుకూలత ఉందని, దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతోందని అన్నారు. తెలంగాణకు వరదలు, తుపాన్లు, బలమైన ఈదురుగాలులు వంటి ప్రకృతి విపత్తులు చాలా తక్కువని, అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలత ఉందని వివరించారు.

తెలంగాణ రికార్డు స్థాయిలో పంటలు పండిస్తోందని, ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ కింద ఎఫ్ సీఐకి ఇచ్చామని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేదని, ఏనాడూ 50 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 7 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు తెరిచి మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఏ రాష్ట్రం ఈ విధంగా చేయడంలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పత్తి కూడా బాగా పండుతోందని, ప్రపంచస్థాయి నాణ్యత దిశగా పయనిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, సూక్ష్మ నీటిపారుదలపై 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. ఇక మీదట రైతులు కూడా నియంత్రిత వ్యవసాయం చేయాలని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలని, ఏ పంటలు వేయాలన్న దానిపై రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి పండిద్దామని, ప్రతి రైతు లక్షాధికారి కావాలన్నదే తమ అభిమతమని అన్నారు.

More Telugu News