KCR: తెలంగాణలో రేపు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం కేసీఆర్

  • నూతన మార్గదర్శకాలను వెల్లడించిన సీఎం 
  • మే 31 వరకు లాక్ డౌన్ అమలు
  • కంటైన్మెంట్ జోన్లలో ఏవీ తెరుచుకోవని వెల్లడి
  • కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆఫీసుల్లో పనిచేసుకోవచ్చని వివరణ
CM KCR explains new guidelines for Telangana

తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులపై సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తున్నామని, కొన్ని సడలింపులు కూడా ప్రకటిస్తున్నామని చెప్పారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని వెల్లడించారు.

అయితే హైదరాబాదులో కేసులు ఎక్కువగా ఉన్నందున సిటీ బస్సులను అనుమతించడంలేదని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల బస్సులు తమ రాష్ట్రంలో ప్రవేశించడానికి వీల్లేదని, తమ రాష్ట్రం బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లవని వివరించారు. హైదరాబాదులో ఆటోలు, కార్లు అనుమతిస్తామని, ఆటోల్లో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులకు, కార్లలో డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చని అన్నారు.

కంటైన్మెంట్ జోన్లలో ఏదీ తెరుచుకోవని, అక్కడి ప్రజలకు ప్రభుత్వమే నిత్యావసరాలు సరఫరా చేస్తుందని వెల్లడించారు. 1452 కుటుంబాలు కంటైన్మెంట్ పరిధిలో ఉన్నాయని, వారికి సరుకులు డోర్ డెలివరీ ఇస్తామని చెప్పారు. ఈ-కామర్స్ సేవలపై ఎలాంటి ఆంక్షల్లేవని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నిర్వహించుకోవచ్చని సీఎం కేసీఆర్ వివరించారు. వాటిలో సిబ్బంది మొత్తం హాజరై పనిచేసుకోవచ్చని తెలిపారు. పరిశ్రమలు, యూనిట్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ 100 శాతం పనిచేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇక, అన్ని మతాల ప్రార్థనామందిరాలు మే 31 వరకు మూతవేయాల్సిందేనని, మతపరమైన ఉత్సవాలు కూడా జరగవని అన్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలో దుకాణాలు, ఇతర కార్యకలాపాలు నడుస్తాయని, హైదరాబాద్ విషయంలో అధికారులు త్వరలోనే ప్రకటిస్తారని చెప్పారు.

More Telugu News