విశాఖ మానసిక వ్యాధుల ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ ను పరామర్శించిన టీడీపీ నేతల బృందం

18-05-2020 Mon 19:26
  • ఇటీవలే అరెస్ట్ అయిన డాక్టర్ సుధాకర్
  • విశాఖ మానసిక వ్యాధుల ఆసుపత్రిలో చికిత్స
  • డాక్టర్ ను పిచ్చివాడిగా ముద్ర వేయడం దారుణమన్న అయ్యన్న
TDP leaders visits Visakha hospital and talk to Dr Sudhakar

ఇటీవలే అరెస్ట్ అయిన డాక్టర్ సుధాకర్ ప్రస్తుతం విశాఖ మానసిక వ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఇవాళ టీడీపీ నేతలు పరామర్శించారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు, గణేశ్ కుమార్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ సుధాకర్ తో మాట్లాడారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ, డాక్టర్ సుధాకర్ కు న్యాయం చేయాలని అన్ని స్థాయుల్లోనూ విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే డాక్టర్ సుధాకర్ ను మానసిక వ్యాధుల ఆసుపత్రిలో ఉంచారని ఆరోపించారు. డాక్టర్ ను కొట్టిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా, మానసికంగా హింసించారని ఆరోపించారు. ఓ వైద్యుడ్ని పిచ్చివాడని ముద్ర వేసేందుకు ప్రయత్నించడం దారుణం కాదా? అని ప్రశ్నించారు.