బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు!

18-05-2020 Mon 18:55
  • వెబ్ సిరీస్ నిర్మించిన బాలాజీ టెలీ ఫిలింస్
  • ఆర్మీ దుస్తులను అభ్యంతరకరంగా చూపించారని ఫిర్యాదు
  • వివరాలను పరిశీలించిన తర్వాత నోటీసులు పంపుతామన్న పోలీసులు
Case registered against Ekta Kapoor in Hyderabad

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విశాల్ కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. బాలాజీ టెలిఫిలింస్ నిర్మించిన వెబ్ సిరీస్ లో ఆర్మీ దుస్తులను అభ్యంతరకర రీతిలో చూపించారంటూ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

ఫేస్ బుక్ పేజ్ లో వెబ్ సిరీస్ కు చెందిన ట్రైలర్ ను రిలీజ్ చేశారని చెప్పారు. ఓ ఆర్మీ అధికారి భార్యకు, వేరే వ్యక్తికి ఉన్న సంబంధాలను ఇందులో చూపించారని పేర్కొన్నారు. ఏక్తా కపూర్ పై చర్యలు  తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత ఏక్తా కపూర్ కు నోటీసులు పంపుతామని పోలీసులు తెలిపారు.