కరోనా వైరస్ ను కూడా టీడీపీనే తెచ్చిందని అంటారేమో!: చంద్రబాబు చురక

18-05-2020 Mon 17:48
  • ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • జగన్ పెడధోరణి కనబరుస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం
Chandrababu talks with party leaders via video conference

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని ఆరోపించారు. అరాచకాలను అడ్డుకున్నవారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల అసైన్డ్ భూములను ఇష్టారాజ్యంగా లాక్కున్నారని, ఇళ్ల పట్టాల ముసుగులో భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. పత్రికలు, ప్రసార సాధనాలపైనా కక్ష సాధిస్తున్నారని, జగన్ కు చట్టంపై గౌరవంలేదు, రాజ్యాంగంపై విశ్వాసం లేదని విమర్శించారు.

తనకు ఎవరైనా సరే భయపడాలన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినట్టు చేస్తాననే పెడధోరణి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఫ్యాక్షనిజం, కుట్రలు, దోపిడీలు, దుష్ప్రచారాలు జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కాళేశ్వరం పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాలు భారత్-పాక్ అవుతాయని నాడు జగన్ దీక్షలు చేశారని, సీఎం అయ్యాక అదే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చారని చంద్రబాబు విమర్శించారు.  వైసీపీ నేతలు కరోనా వైరస్ ను కూడా టీడీపీనే తెచ్చిందని అంటారేమోనని చురక అంటించారు.