కత్తులు, హాకీ స్టిక్స్ తో దాడి చేసి... హైదరాబాదులో దారుణ హత్య!

18-05-2020 Mon 17:14
  • ఆసిఫాబాద్ లో శ్రవణ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
  • పోలీసుల ముందు లొంగిపోయిన ఇద్దరు నిందితులు
  • తామే హత్య చేశామంటూ ఒప్పుకున్న  వైనం
Young man murdered in Hyderabad

హైదరాబాదులో కత్తులు, హాకీ స్టిక్స్ తో దాడి చేసి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. తామే హత్య చేశామంటూ ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రవణ్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటోంది.

అతను కార్పెంటర్ గా పని చేస్తూనే... నర్సింగ్ అనే ఒక వ్యాపారి వద్ద డ్రైవర్ గా కూడా పని చేస్తున్నాడు. తన యజమాని కుమారుడి పెళ్లి ఉండటంతో గత రెండు రోజులుగా ఆ పని మీదే ఉంటున్నాడు. నిన్న రిసెప్షన్ ఉండటంతో అక్కడకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇంతలో ఓ యువకుడు వచ్చి... శ్రవణ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని చెప్పాడు.

ఘటనా స్థలికి హుటాహుటిన కుటుంబసభ్యులు వెళ్లారు. ఆ సమయంలో శ్రవణ్ కొనఊపిరితో ఉన్నాడు. 108కి కానీ, పోలీసులకు కానీ ఫోన్ చేయమని అక్కడున్న వారిని కుటుంబసభ్యులు కోరినా... ఎవరూ స్పందించలేదు.

జరిగిన ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రవణ్ కు ఎవరితో గొడవలు లేవని, స్నేహితులే హత్య చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, శ్రవణ్ ను హత్య చేశామంటూ ఇద్దరు యువకులు ఆసిఫ్ నగర్ పోలీసుల ముందు లొంగిపోయారు. శ్రవణ్ తో పని చేస్తున్న మరో యువకుడు చింటూకు సంబంధించిన సమాచారం చెప్పకపోవడం వల్లే దాడి చేశామని వారు చెప్పారు. మరోవైపు, ఎవరి మీదో ఉన్న కోపాన్ని తమ వాడిపై చూపించడంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.