బస్టాండు నుంచి బస్టాండుకు మాత్రమే... మధ్యలో ఎవరినీ ఎక్కించుకోవద్దు: సీఎం జగన్ సూచనలు

18-05-2020 Mon 17:09
  • సాధారణ ప్రాంతాల్లో వాహనాలు తిప్పుకునేందుకు కేంద్రం అనుమతి
  • బస్సులు తిప్పే అంశంపై సీఎం జగన్ సమీక్ష
  • తొలుత ఇతర రాష్ట్రాల నగరాలకు బస్సులు
  • బస్సు ఎక్కే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకోవాలని స్పష్టీకరణ
 CM Jagan reviews on how to restart transport system

కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ, హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్ల వెలుపల బస్సులు, ఇతర వాహనాలు తిప్పుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర కసరత్తు జరుపుతోంది. మంత్రులు, అధికారులతో చర్చించిన సీఎం జగన్ ఆసక్తికర సూచనలు చేశారు.

తొలుత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులతో మొదలుపెట్టి క్రమంగా రాష్ట్రంలోనూ బస్సులు తిప్పాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏపీకి చెందినవారు ఇంకా ఉన్నందున వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ పోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఒక నగరంలోని బస్టాండ్ నుంచి గమ్యస్థానంలోని బస్టాండ్ వరకు సర్వీసులు నడపాలని, మధ్యలో ఎవరినీ ఎక్కించుకోరాదని అన్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించాలని, బస్సు ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

ఎక్కడ ఎక్కారు? ఎక్కడికి వెళుతున్నారన్న దానిపై స్పష్టమైన వివరాలు సేకరించాలని తెలిపారు. ఆపై, రాష్ట్రంలోనూ భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని స్పష్టం చేశారు. బస్సు సర్వీసులు నడిపేందుకు సమగ్ర రీతిలో విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు.