చైనా లెక్క బట్టబయలు... కరోనా కేసులు 6 లక్షల పైనేనట!

18-05-2020 Mon 12:33
  • నివేదిక తయారు చేసిన రక్షణ సాంకేతిక జాతీయ విశ్వ విద్యాలయం 
  • రిపోర్టు వివరాలు లీక్
  • 6.40 లక్షల కేసుల నమోదు
  • ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
New Report Says China Wrong Calculations on Corona

తమ దేశంలో కరోనా వైరస్ ను అదుపు చేశామని చైనా చెప్పుకుంటోంది. ఇండియా కూడా కరోనా కేసుల విషయంలో చైనాను దాటేసిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన రక్షణ సాంకేతిక జాతీయ విశ్వ విద్యాలయం తయారు చేసిన ఓ రిపోర్టు లీక్ అయి, సంచలనం సృష్టించింది.

 చైనాలో ఇంతవరకూ 6.40 లక్షలకు పైగా కొవిడ్-19 కేసులు నమోదయ్యాయన్నది ఈ నివేదిక సారాంశం. చైనా చెబుతున్న గణాంకాలతో పోలిస్తే, వాస్తవ కేసుల సంఖ్య 8 రెట్లకు పైగానే ఉందని చెబుతూ, వాషింగ్టన్ కేంద్రంగా పని చేస్తున్న 'ఫారిన్‌ పాలసీ మ్యాగజైన్‌ అండ్‌ 100 రిపోర్టర్స్' పేర్కొంది.

చైనా దేశ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్‌ లు, సూపర్‌ మార్కెట్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ లో నమోదైన కేసులన్నిటినీ క్రోఢీకరించి, ఈ గణాంకాలు అంచనా వేస్తున్నామని,  దేశంలోని 230 నగరాల్లో నమోదైన రికార్డులను పరిశీలించామని నివేదిక పేర్కొంది. ఇక చైనా అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకూ 82 వేలకు పైగా కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే.

అమెరికా సహా పలు దేశాలు కరోనా పాజిటివ్ కేసులపై చైనా తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక సంచలనం కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుందంటూ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. వైరస్ ను అదుపులోకి తెచ్చామని భావిస్తున్న చైనా, లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. తాజా రిపోర్టుతో నిజానిజాలు పూర్తిగా తెలియని చైనీయులు సైతం ఆందోళన చెందుతున్నారు.