Chennai: రోడ్డున పడ్డ 'లగ్జరీ' యువతులు... మీడియా స్పందనతో ఆదుకున్న యంత్రాంగం!

  • చెన్నైలోని పోష్ ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్ర యువతులు
  • నిన్నటివరకూ డాబుగా బతికి, నేడు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు
  • వెళ్లేందుకు అనుమతి ఉన్నా, పరిస్థితి చూసి కొండెక్కిన ఆటో డ్రైవర్లు
  • అందరినీ అసోం భవనానికి చేర్చిన పోలీసులు
Northestren States Girls Suffered with Lockdown in Chennai

వారంతా లాక్ డౌన్ కు ముందు స్టార్ హోటల్స్, మాల్స్, స్పా, బ్యూటీ సెంటర్లలో చాలా మంచి జీతానికి పనిచేసిన వారే. చెన్నైలో అత్యంత పోష్ గా ఉండే అన్నానగర్ ప్రాంతంలో లగ్జరీగా బతికిన వారే. నిత్యమూ జీన్స్, టీ-షర్ట్ వంటి ఆధునిక దుస్తులను ధరిస్తూ, వీధుల్లో అందరి చూపులనూ తమవైపు తిప్పుకుంటూ బతికిన వారే. వీరిలో అత్యధికులు నాగాలాండ్, అసోం రాష్ట్రాలకు చెందిన వారు. మార్చి వరకూ ఎంతో దర్జాగా బతికిన వీరు, ఇప్పుడు రోడ్డున పడ్డారు. లాక్ డౌన్ ముగుస్తుంది, తిరిగి ఇక్కడే బతకొచ్చన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు ఇక్కడే వున్నారు. ఇప్పుడిక చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోగా, ఇక లాభంలేదు, స్వస్థలాలకు వెళ్లాలని వీరు బయలుదేరగా, క్యాబ్, ఆటో డ్రైవర్ల తీరు మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, చెన్నై, శాంతి కాలనీ పరిసరాల్లో వాణిజ్య సముదాయాలు అధికంగా ఉండగా, ఇక్కడే చాలా కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పలు కంపెనీలు తమ సిబ్బంది ద్వారా స్టార్ హోటల్స్, మాల్స్ లో ఉద్యోగులను సమకూరుస్తుండగా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పని చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత వీరికి పని పోయింది. జీతం చేతికందే పరిస్థితి లేదు. దీంతో వీరంతా దాదాపు రెండు నెలలు, తమ వద్ద ఉన్న డబ్బుతోనే నెట్టుకొని వచ్చారు. ఇక ఇప్పట్లో సెలూన్లు, బ్యూటీ స్పాలకు అనుమతి ఇచ్చేది లేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇక చేసేదేమీ లేక, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, తమ స్వరాష్ట్రానికి వెళ్లాలని వీరంతా నిశ్చయించుకున్నారు. దరఖాస్తు చేసి, అనుమతులు పొందారు. ఇక వీరంతా అసోం భవనానికి చేరుకుంటే, అక్కడి అధికారులు స్వరాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే వీరికి కష్టాలు మొదలయ్యాయి. అసోం భవన్ కు వెళ్లేందుకు చార్జీగా తమ వద్ద ఉన్న డబ్బంతా ఇవ్వాల్సిన పరిస్థితి వీరికి ఎదురైంది. వీరి చేతిలో పాస్ ఉండటంతో, వీరిని అసోం భవనానికి చేరుస్తామంటూ, కొందరు ఆటో డ్రైవర్లు సిద్ధమయ్యారు. అందుకు ప్రతిగా వేలల్లో అడిగారు. పోలీసులు పట్టుకుంటే తాము ఇరుక్కుంటామని సాకులు చెబుతూ, యువతులు కన్నీరు పెట్టుకున్నా ఆటో డ్రైవర్లు కరుణించలేదు.

దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అందరూ విషణ్ణ వదనాలతో రోడ్డుపై ఉండగా, ఆ వైపు వెళ్లిన ఫోటో జర్నలిస్ట్ కుమరేషన్ చూశాడు. వారిని అడిగి విషయం తెలుసుకుని, వెంటనే చెన్నై ప్రెస్ క్లబ్ కు సమాచారాన్ని ఇచ్చాడు. వారు పోలీసులకు విషయాన్ని చేర్చగా, పోలీసులు, అధికారులు స్పందించారు. ఆ ప్రాంతానికి చేరుకుని, అక్కడ వేచివున్న 20 మంది యువతులతో మాట్లాడి, వారిని ఆటోల్లో ఎక్కించి, భద్రత కల్పించి, మేడవాక్కం ప్రాంతంలోని అసోం భవనానికి పంపించారు. ఆపై వీరిని స్వరాష్ట్రానికి తామే చేరుస్తామని అక్కడి అధికారులు వెల్లడించారు. యువతుల కన్నీటి కష్టాలను తెరపైకి తెచ్చి, వారి సమస్యను పరిష్కరించిన ఫోటో జర్నలిస్ట్ కుమరేషన్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.

More Telugu News