మీరిచ్చే బియ్యం ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో వండించండి.. తినేటట్లు ఉన్నాయా?: దేవినేని ఉమ

18-05-2020 Mon 10:18
  • ఏపీ సర్కారుపై దేవినేని ఫైర్
  • ఉన్నత న్యాయస్థానం తీర్పులను లెక్క చేయట్లేదు
  • వలస కార్మికులను మళ్లీకొట్టారు
  • రేషన్ షాపుల్లో మీరిచ్చే బియ్యం, శనగలు బాగోలేవు
devineni fires on ycp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తీరు సరికాదని మండిపడ్డారు. 'ఉన్నత న్యాయస్థానం తీర్పులను లెక్క చేయకుండా వలస కార్మికులను మళ్లీ కొట్టారు. అన్నం మంచినీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన చోట లాఠీలు విరుగుతున్నాయి, తలలు పగులుతున్నాయి. సొంతూళ్లకు పంపించమంటున్న వలస కూలీలపై మీ ప్రతాపమా? ఇది ఆటవికరాజ్యమా ప్రజాస్వామ్యమా సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారూ' అని ఆయన ట్వీట్ చేశారు.

'75 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రి 9 రకాల నిత్యావసరాలను ఇళ్లకు పంపారు. ఇక్కడ మాత్రం రేషన్ షాపుల్లో ఏపీ సర్కారు ఇచ్చే బియ్యం, శనగలు కూడా బాగోలేవు. ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో వండించండి తినేటట్లు ఉన్నాయా? సాములోరు చెప్పారని ముక్కిపోయిన శనగలు ఇస్తారా? ప్రజలు కందిపప్పు సరుకులు అడుగుతున్నారు.. సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారూ' అని దేవినేని ఉమ నిలదీశారు.