Guidelines: కేంద్రం మార్గదర్శకాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు!

  • తాజా మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం
  • జోన్లపై నిర్ణయాధికారం రాష్టాలకు అప్పగింత
  • వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఆంక్షలు విధించరాదని స్పష్టీకరణ
Centre issues new guidelines

కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ లో మరోసారి లాక్ డౌన్ పొడిగించారు. ఈసారి మే 31 వరకు లాక్ డౌన్ ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, లాక్ డౌన్ 4.0కి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఈసారి జోన్ల ఏర్పాటు, ప్రకటనలపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చారు. కరోనా కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల ఏర్పాటు చేసుకోవడమే కాదు, వాటిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆఫీసులు, పరిశ్రమలు తగిన జాగ్రత్తలతో నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు.

65 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భవతులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటివద్దే ఉండాలని సూచించారు. ఆరోగ్య సేతు యాప్ ను ఉద్యోగులందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని, ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ కలిగివుండేలా అధికారులు తగిన సలహాలు, సూచనలు చేయాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సాధారణ వ్యక్తుల్లోనూ ఆరోగ్య సేతు యాప్ వినియోగం పట్ల చైతన్యం కలిగించాలని తెలిపారు.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వైద్య, ఆరోగ్య నిపుణులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, అంబులెన్స్ ల కదలికలపై ఆంక్షలు విధించరాదని కేంద్రం స్పష్టం చేసింది. వారు ఇతర రాష్ట్రాల్లో సేవలు అందించాల్సిన అవసరం వస్తే అనుమతించాలని సూచించింది.

More Telugu News