Gautam Gambhir: కశ్మీర్ పై అఫ్రిది వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన గంభీర్

  • కశ్మీర్ ప్రజల వేదన గుర్తించడానికి మనసుంటే చాలన్న అఫ్రిదీ
  • అఫ్రిదీని జోకర్ తో పోల్చిన గంభీర్
  • భారత్ పై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం
Gambhir reacts on Afridi commnets over Kashmir

మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది మైదానంలోనే కాదు, ఆట నుంచి రిటైరైన తర్వాత కూడా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ కు చెందిన అఫ్రిది తరచుగా కశ్మీర్ పై వ్యాఖ్యానిస్తూ భారత్ పట్ల తన విద్వేషాన్ని వెళ్లగక్కుతుంటాడు. దీనిపై గంభీర్ తీవ్రస్థాయిలో స్పందిస్తుంటాడు. ఇటీవల షాహిద్ అఫ్రిది కశ్మీర్ పై స్పందించాడు. కశ్మీర్ ప్రజల వేదనను గుర్తించడానికి మతపరంగానే స్పందించాల్సిన అవసరంలేదని, తగిన మనసు ఉంటే చాలని అన్నాడు. దీనిపై గంభీర్ దీటుగా బదులిచ్చాడు.

"20 కోట్ల మంది ప్రజలున్న పాకిస్థాన్ కు 7 లక్షల మందితో సైన్యం ఉందని ఈ 16 ఏళ్ల కుర్రాడు చెబుతున్నాడు. అయినాగానీ 70 ఏళ్లుగా కశ్మీర్ కావాలంటూ దేబిరిస్తున్నారు. అఫ్రిది, ఇమ్రాన్, బజ్వా వంటి జోకర్లు పాక్ ప్రజల్ని వెర్రివాళ్లను చేస్తూ భారత్ పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా విషం చిమ్ముతూనే ఉన్నారు. కానీ ఎప్పటికీ కశ్మీర్ ను పొందలేరు. బంగ్లాదేశ్ విషయంలో ఏం జరిగిందో ఓసారి గుర్తుచేసుకోవాలి" అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

కాగా, అఫ్రిదీని గంభీర్ 16 ఏళ్ల కుర్రాడితో పోల్చడానికి కారణం ఉంది. జూనియర్ టీమ్ సెలెక్షన్స్ లో అఫ్రిది వయసు తప్పుగా చెప్పి సెలెక్షన్స్ లో పాల్గొన్నాడు. ఈ సంగతి అఫ్రిదీనే స్వయంగా చెప్పాడు. ఇప్పుడా విషయాన్నే గంభీర్ ఎత్తిచూపాడు.

More Telugu News