nirmala sitaraman: అవసరార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశాం: నిర్మలా సీతారామన్

  • ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి
  • సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలి
  • ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని మోదీ  చెబుతున్నారు
  • భూమి, శ్రమ, చట్టాలు.. ఈ మూడింట్లో సంస్కరణలకు శ్రీకారం  
nirmala sitaraman to address on corona package

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరిన్ని వివరాలు తెలిపారు. పలు రంగాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలు వెల్లడించారు. సంక్షోభం తలెత్తింది వాస్తవమేనని, అయితే, సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని చెప్పారు.

అవసరార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశామని అన్నారు. భవన నిర్మాణాల రంగానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమచేశామని తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులు రూ.3,600 కోట్ల నగదు వెనక్కి తీసుకున్నారని చెప్పారు.

మూడు నెలల పాటు పేదలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు. జన్‌ధన్‌కు సంబంధించి రూ.20 కోట్ల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు.  ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని మోదీ మొదటి నుంచీ చెబుతున్నారని తెలిపారు.

భూమి, శ్రమ, చట్టాలు ఈ మూడింట్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఆహారధాన్యాలు, పప్పు దినుసులు అందిస్తున్నామని చెప్పారు. గరీబ్‌ కల్యాణ్ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ చేశామని చెప్పారు.

సాంకేతిక పరమైన సంస్కరణలు జరగకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కార్మికులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు శ్రామిక్‌ రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. రైళ్లకు అయ్యే ఖర్చులు 85 శాతం కేంద్రం, 15 శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయని తెలిపారు.

వ్యాపార మోసాల నివారణ, రాష్ట్రాలకు ఆర్థిక వనరులపై ప్యాకేజీ ప్రకటించామని తెలిపారు. వైద్య సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రూ.15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. రూ.4,113 కోట్లను రాష్ట్రాలకు ఇచ్చిందని తెలిపారు. టెస్టు కిట్లు, తదితర అంశాల కోసం రూ.3,750 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఆరోగ్య రంగంలో పనిచేసే 50 లక్షల మందికి బీమా అందించినట్లు తెలిపారు. పీపీఈ కిట్ల విషయంలో భారత్ 2 నెలల స్వయం సమృద్ధిని సాధించిందని అన్నారు.

More Telugu News