Pawan Kalyan: అంటే... అప్పటి వరకు వారిని ఉద్యోగాల్లోకి పిలవరా?: పవన్ కల్యాణ్

  • 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకున్నారు
  • ఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వు వారిని భయాల్లోకి నెట్టేసింది
  • ఇన్స్యూరెన్స్ లేనందువల్ల విధుల్లోకి తీసుకోలేదనడం సరికాదు
Pay salaries for APSRTC contract workers demands Pawan Kalyan

ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో భయాందోళనలను తొలగించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. దాదాపు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారని చెప్పారు. 13వ తేదీన ఆర్టీసీ ఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక ఉత్తర్వు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను భయాందోళనలలోకి నెట్టేసిందని చెప్పారు. వీరి జీతాలు రూ. 6 వేల నుంచి రూ. 15 వేల మధ్య ఉంటాయని తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించకపోతే వారంతా ఎలా బతుకుతారని పవన్ ప్రశ్నించారు. ప్రస్తుత కష్ట కాలంలో ఉద్యోగాలను తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని రవాణా మంత్రి ఈరోజు ప్రకటించినప్పటికీ... వారిలో భయాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత కరోనా సమయంలో ఇన్స్యూరెన్స్ లేనందునే వారిని విధుల్లోకి తీసుకోలేదని మంత్రి చెప్పడం సరికాదని అన్నారు. ఈ కరోనా ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదని... అప్పటి వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి పిలవరా? అని మండిపడ్డారు. వీరికి తక్షణమే జీతం బకాయిలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత హామీని లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News