Goa: ఎంజాయ్ చేసేందుకు ఎవరూ ఇక్కడకు రావద్దు: గోవా ముఖ్యమంత్రి

Dont Come To Goa To Enjoy Says Chief Minister Pramod Sawant
  • ప్రత్యేక రైల్లో గోవాకు వచ్చేందుకు 720 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు
  • వీరంతా గోవా ప్రజలు కాదని తెలిసింది
  • గోవాకు ఎవరు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే
మన దేశంలో గోవాకు ఉన్న ప్రత్యేకత వేరు. టూరిస్ట్ డెస్టినేషన్ గా గోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు కచ్చితంగా గోవాకు వెళ్తుంటారు. ఇక మన జనాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో, అంతా తలకిందులైంది. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే గోవా బీచులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కీలక ప్రకటన చేశారు.

గోవాలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, మడగావ్ రైల్వే స్టేషన్ లో స్పెషల్ ట్రైన్లు ఆగవని ఆయన చెప్పారు. వివిధ మార్గాల ద్వారా గోవాకు చేరుకునే వారు కచ్చితంగా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వారు గోవా ప్రజలు కాకున్నా క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని చెప్పారు.

వాస్తవానికి ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్లే ప్రత్యేక రైలు మడగావ్ రైల్వే స్టేషన్ లో ఆగాల్సి ఉంది. అయితే, ఇక్కడ రైలును ఆపొద్దని రైల్వే శాఖకు నిన్న ముఖ్యమంత్రి విన్నవించారు. 720 మంది ప్రజలు మడగావ్ లో దిగేందుకు టికెట్లను బుక్ చేసుకున్నారని.. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా గోవా వ్యక్తి కాదనే విషయం తమకు తెలిసిందని చెప్పారు.

వీరంతా గోవాలో అడుగుపెడితే  తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన తమలో ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వారందరినీ టెస్ట్ చేయాలని, హోమ్ క్వారంటైన్ కు పంపించాలని... అయితే వారంతా ఈ నిబంధనను పాటిస్తారనే నమ్మకం లేదని చెప్పారు. ఈ కారణం వల్లే గోవాలో రైలును ఆపొద్దని కోరామని తెలిపారు. అయితే, తమ విన్నపంపై స్పందన ఏమిటనేది ఇంకా కొంకన్ రైల్వే అధికారుల నుంచి రాలేదని చెప్పారు.

ఎవరైనా వచ్చినా... హోటల్స్ లోనే నిర్బంధంలో ఉండాలని, బీచ్ లలోకి ప్రవేశించరాదని సావంత్ చెప్పారు. ప్రస్తుతం గోవా బీచ్ లన్నీ క్లోజ్ అయ్యాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంజాయ్ చేయడానికి గోవాకు ఎవరూ రావద్దని కోరారు. విమానాల్లో వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లోనే టెస్టులు చేస్తామని చెప్పారు. ఓడల్లో మార్మగోవా పోర్టుకు చేరుకునే వారికి కూడా పరీక్షలను నిర్వహిస్తామని... వైరస్ సోకలేదని తేలితేనే వారు ముందుకు కదలడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
Goa
Tourists
Beach
Pramod Sawant
Quarantine Centre
Lockdown

More Telugu News