Fabric Coating: బెంగళూరు శాస్త్రవేత్తల ఘనత... దుస్తులపై కరోనా అంటకుండా సరికొత్త రసాయన పూత!

  • ఎన్సీబీఎస్ శాస్త్రవేత్తల పరిశోధనలు
  • కరోనా క్రిములను అచేతనంగా మార్చే రసాయన పూత
  • తయారీ కోసం ప్రయత్నాలు
Bengaluru bases researchers made fabric coating to prevent corona

బెంగళూరు శాస్త్రవేత్తలు కరోనాపై పరిశోధనల్లో ఆసక్తికర ఆవిష్కరణ సాధించారు. దుస్తులపై కరోనా వైరస్ క్రిములు అంటకుండా సరికొత్త పూతను రూపొందించారు. దుస్తులపై ఈ రసాయనాన్ని పూయడం ద్వారా సూక్ష్మక్రిములను దూరంగా ఉంచవచ్చని నిరూపించారు. మెంబ్రేన్ (కణజాల పొర) కలిగివున్న ఏ సూక్ష్మజీవినైనా ఈ రసాయన పూత అచేతనంగా మారుస్తుందని బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్సీబీఎస్) ప్రొఫెసర్ సత్యజిత్ మయూర్ వెల్లడించారు. బాక్టీరియాతో పాటు చాలావరకు వైరస్ లు మెంబ్రేన్ లను కలిగివుంటాయని వివరించారు.

దీనిపై అధికారిక ప్రకటన చేసేముందు, ఇది ఎంత మేరకు పనిచేస్తుందన్నది తెలుసుకోవడం అత్యావశ్యకం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న రోగుల విషయంలో ఈ రసాయన పూతతో పెద్దగా ఉపయోగం ఉండదని తెలుస్తోంది. దుస్తుల ద్వారా వ్యాప్తి చెందడాన్ని మాత్రం ఇది గట్టిగా నివారిస్తుందని, సాధారణ దుస్తులు, పీపీఈ కిట్లు, మెడికల్ గౌన్లు, ఇతర ఉపరితలాలపై కరోనా క్రిములను సమర్థంగా నిర్మూలించగలదని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం దీని తయారీకోసం శాస్త్రవేత్తలు రసాయన ఉత్పత్తుల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రసాయన పూతలో అమ్మోనియం లవణాలు కీలక భూమిక పోషిస్తాయని తెలుస్తోంది.

More Telugu News