Lockdown 3.0: సోమవారం నుంచి లాక్ డౌన్ 4.0 .. ఏయే రాష్ట్రాలు ఏం కోరుతున్నాయంటే..!

  • ఆదివారంతో ముగుస్తున్న మూడో విడత లాక్ డౌన్
  • కేంద్రానికి ఇప్పటికే సూచనలు చేసిన సీఎంలు
  • ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకే పలు రాష్ట్రాల మొగ్గు
What States Are Planning For Lockdown 4

సోమవారం నుంచి లాక్ డౌన్ 4.0  ప్రారంభం కాబోతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో... లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశాయి. ప్రజారవాణా (మెట్రో రైళ్లు, విమానాలు సహా)తో పాటు, కంటైన్మెంట్ జోన్లలో లేని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఈ వారం ప్రారంభంలో దాదాపు ఆరు గంటల సేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

ఏపీ, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు ఆర్థికపరమైన కార్యకలాపాలను పునఃప్రారంభించాలని కోరుతున్నాయి. ఢిల్లీలో ఆంక్షలను సరళతరం చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిన్న కోరారు. టూరిజంపై ఎక్కువగా ఆధారపడే కేరళ... మెట్రో సర్వీసులు, డొమెస్టిక్ విమాన సర్వీసులు, హోటల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేయాలని కోరుతోంది.

హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్ములు తెరవాలని కర్ణాటక విన్నవిస్తోంది. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించాలని తమిళనాడు, గుజరాత్ కోరుతున్నాయి. కరోనాతో విలవిల్లాడుతున్న మహారాష్ట్ర కూడా పెద్ద స్థాయిలో కార్యాలయాలను తెరవాలనే ఆలోచనలో ఉంది.

బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, అసోం మాత్రం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నాయి. మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాక్ డౌన్ ఈ నెల 27 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు కొందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పై సూచనలు చేస్తూనే... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తామని ప్రకటించారు.

More Telugu News