Corona Virus: చైనాను దెబ్బతీసేందుకు అమెరికా భారీ ప్లాన్‌.. భారత్‌కు సాయం

  • భారత్‌తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేయనున్న అమెరికా
  • 18 అంశాలతో కూడిన కార్యాచరణ విడుదల
  • భారత్‌తో పాటు తైవాన్‌, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయం
  • జపాన్‌ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం
  • దక్షిణ కొరియాతో పాటు జపాన్‌కు ఆయుధాలు విక్రయం
america on china

కరోనా వైరస్‌ గురించి ముందుగా చెప్పకుండా దాచి పెట్టిన చైనాపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆ వైరస్‌ను చైనా ల్యాబ్‌లోనే తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే చైనాపై ఆంక్షల విధింపునకు సెనేట్‌లో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. కరోనా విపత్తుకు చైనాయే బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచేందుకు మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్‌తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా, 18 అంశాలతో కూడిన ఓ కార్యాచరణను అమెరికా రూపొందించింది. తమ మిత్రపక్షాలతో సైనిక బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భారత్‌తో పాటు తైవాన్‌, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయాన్ని విస్తరించాలని నిర్ణయించింది.  

‘పసిఫిక్‌ డిటెరెన్స్‌ ఇనిషియేటివ్‌’ను ప్రారంభించాలని, 20 బిలియన్‌ డాలర్ల నిధుల సైనిక విభాగం ఏర్పాటు ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలని యోచిస్తోంది. అలాగే, జపాన్‌ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలని, దక్షిణ కొరియాతో పాటు జపాన్‌కు ఆయుధాలు విక్రయించాలని నిర్ణయించింది.  

చైనాలోని అమెరికా ఉత్పత్తి సంస్థలను తిరిగి స్వదేశానికి రప్పించాలని, దీని ద్వారా సరఫరా గొలుసులో చైనాపై  ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రణాళిక వేసుకుంది. తమ సాంకేతికతను చైనా చోరీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. హువావేపై విధించిన నిషేధాన్ని అమలు చేయాలని, తమ మిత్రపక్షాలు సైతం అదే బాటలో నడిచేలా చూడాలని ప్రణాళిక వేసుకుంది. వైరస్ వ్యాప్తిపై మభ్యపట్టే ప్రయత్నాలు చేసినందుకు చైనాపై ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది.

మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ ఆంక్షలు అమలు చేయాలని ప్రణాళిక వేసుకుంది. 2022 శీతాకాల ఒలింపిక్స్‌ వేదికను బీజింగ్‌ నుంచి మార్చేలా ప్రయత్నాలు జరపాలని యోచిస్తోంది. తమ దేశంలో చైనా సర్కారు నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్రను పెంచేలా సంస్కరణలు చేపట్టాలని ప్లాన్‌ వేసుకుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకొని చైనా సంధిస్తోన్న రుణ బాణాలను బయటపెట్టి దాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకుంది.  అంతేగాక, తమ ‘ఫారెన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వైలెన్స్ చట్టాన్ని అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించింది.

చైనాను దెబ్బ తీసే చర్యల్లో భాగంగా భారత్‌తో సైనికబంధం బలోపేతం చేయాలని అమెరికా సెనేటర్ థామ్ టిలిస్ అన్నారు. కరోనా మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఈ పై సూత్రాలను ఆయనే ప్రతిపాదించారు. తన ప్రణాళికను ఆవిష్కరించే సందర్భంలో  చైనాపై ఆయన విమర్శలు గుప్పించారు. చైనా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తిని వంటి అన్ని అంశాలను దాచిపెట్టిందని, దీని వల్ల ప్రపంచానికి మహమ్మారి వ్యాపించిందని తెలిపారు. అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి ముప్పు తెస్తుందని తెలిపారు. చైనాపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు.

More Telugu News