Nizamabad District: తెలంగాణలో గ్రీన్‌జోన్‌గా మారుతున్న మరో జిల్లా!

  • కరోనా ఫ్రీ జిల్లాగా మారిన నిజామాబాద్
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చివరి నలుగురు బాధితులు
  • వలస కార్మికులపై దృష్టి సారించిన అధికారులు
Nizamabad district is going to be green zone

తెలంగాణలో మరో జిల్లా గ్రీన్ జోన్ గా మారబోతోంది. నిజామాబాద్ జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా మారింది. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి నలుగురు బాధితులు కూడా డిశ్చార్జి కావడంతో... జిల్లాలో కేసుల సంఖ్య సున్నాకు పడిపోయింది. జిల్లాలో మొత్తం 61 మందికి కరోనా సోకగా... వీరందరికీ వైద్యం అందించారు.

ఢిల్లీ మర్కాజ్ కు వెళ్లిన వారి వల్లే నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాపించింది. దీంతో, వారితో పాటు, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లోకి వచ్చిన 1,035 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 61 మందికి పాజిటివ్ గా తేలడంతో... వారికి చికిత్స అందించారు. మిగిలిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి ఇళ్లకు పంపించారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన ఏ ఒక్కరికీ కరోనా లేకపోవడంతో... ఒకటి, రెండు రోజుల్లో గ్రీన్ జోన్ గా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. జిల్లా గ్రీన్ జోన్ గా మారితే... కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాక్ డౌన్ ఆంక్షలను మరింత సడలిస్తారు.

మరోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి నిజామాబాద్ జిల్లాకు తిరిగి వస్తున్న వలస కార్మికులకు సరిహద్దుల్లోనే వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారికి ముద్రలు వేసి, 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు లేకపోవడంతో... వలస కార్మికులపైనే అధికారులు దృష్టిని సారిస్తున్నారు.

More Telugu News