Donald Trump: అమెరికాను చైనా కొల్లగొడుతోంది.. ఇక సంబంధాలు కట్ చేస్తా: డొనాల్డ్‌ ట్రంప్

  • దీనివల్ల అమెరికాకు 500 బిలియన్ డాలర్ల ఆదా
  • చైనా వ్యవహార శైలితో ఏ మాత్రం సంతృప్తికరంగా లేను
  • తొలిదశ వాణిజ్య ఒప్పందం విషయంలో మళ్లీ చర్చించను
trump on corona virus

అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా వదులుకుంటామని, ఇందుకు తాము ఏ మాత్రం వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనివల్ల అమెరికాకు 500 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ విషయంపై చైనాపై ట్రంప్ కొన్ని రోజులుగా మండిపడుతున్న విషయం తెలిసిందే.

ఆ వైరస్ వ్యాప్తి గురించి చైనా ముందుగా ప్రకటన చేయనందుకే తమ దేశంలో ఇంతగా వైరస్ విజృంభించిందని ఆయన అంటున్నారు. ఈ మహమ్మారి విషయంలో  చైనా వ్యవహార శైలితో తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం విషయంలో మళ్లీ చర్చలు జరిపే అవకాశం లేదని ట్రంప్ చెప్పారు. కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో చర్చలు జరపడానికి తాను ఏ మాత్రం ఇష్టపడడం లేదని అన్నారు.

మరోవైపు, వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పైనా ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంస్థ విషయంలో త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కాగా, చైనాపై కఠిన చర్యలు విధించే క్రమంలో ఇప్పటికే సెనేట్లో  బిల్లును కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వైరస్ పుట్టుక గురించి పూర్తి సమాచారం ఇవ్వకపోతే  ఆంక్షలు విధించాలని అందులో పేర్కొన్నారు.

More Telugu News