TSRTC: ఏ బస్సులో సీటింగ్ ఎలా ఉంటుంది?... టీఎస్ ఆర్టీసీ ప్రతిపాదనలు ఇవే!

  • రేపటి నుంచి తిరగనున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు
  • భౌతిక దూరాన్ని తప్పనిసరి చేస్తూ టీఎస్ అధికారుల ప్రతిపాదనలు
  • పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల విషయంలో విధివిధానాలు
  • సీఎం పచ్చజెండా ఊపగానే సర్వీసులు
TSRTC New Seating Arrangements in Buses

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి తెలంగాణ రాజధాని నుంచి పరుగులు పెట్టనున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు 8 వారాల నుంచి తిరగని బస్సులు రోడ్లపైకి రానుండటంతో, తెలంగాణ ఆర్టీసీ సైతం స్పందించింది. కనీసం సంవత్సరం పాటు లేదా కరోనాకు వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతికదూరం పాటించడం తప్పనిసరైన పరిస్థితుల్లో, తగు జాగ్రత్తలు తీసుకుని ఆర్టీసీ బస్సులను నడిపించాలని భావిస్తూ, అందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

సూపర్ లగ్జరీ బస్సుల్లో అటూ ఇటూ ఉండే రెండేసి సీట్ల స్థానంలో ఒక్కో సీటు ఉంచి, మధ్య వరుసలో మరో సీటును అమర్చి నమూనా బస్ ను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ అంగీకరిస్తే, మిగతా అన్ని బస్సులనూ ఇదే విధంగా మారుస్తారు. ఇక ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల విషయానికి వస్తే, ఈ బస్సుల్లో ఓ వైపు మూడు సీట్లు, మరోవైపు రెండు సీట్లు ఉంటాయి. అంటే, వరుసకు ఐదుగురు కూర్చోవచ్చు. ఐదుగురి స్థానంలో ఇద్దరే కూర్చునేలా నిబంధనలను మారుస్తున్నారు. ఈ బస్సుల్లో సీట్లను మార్చకుండా జిగ్ జాగ్ పద్ధతిలో ప్రయాణికులను అనుమతిస్తారు.

అంటే, తొలి వరుసలో మూడు సీట్లున్న లైన్ లో ఒకరు కిటికీ పక్కన కూర్చుంటే, రెండు సీట్లున్న చోట కూర్చునే వ్యక్తి, కిటికీ పక్కన ఉండరాదు. ఇక రెండో లైన్ లో కుడి వైపున్న వ్యక్తి కిటికీ పక్కన కూర్చుంటే, మూడు సీట్లుండే స్థానంలోని వ్యక్తి కిటికీ పక్కన ఉండకుండా నిబంధనలు మారుస్తున్నారు. ఇలా చేస్తే ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కనీసం మీటరు వరకూ ఉంటుందని అధికారులు తేల్చారు.

ఇక సిటీ బస్సుల విషయానికి వస్తే, నిలబడి ప్రయాణించడాన్ని రద్దు చేస్తూ, సీటుకు ఒకరే ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. దీని అమలు కాస్తంత కష్టమే అయినా, ఎలాగైనా అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

వాస్తవానికి తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి మినహా మిగతా ప్రాంతాలన్నీ దాదాపు గ్రీన్ జోన్ లోనే ఉండగా, కేంద్రం నుంచి అనుమతులు లభించి, కేసీఆర్ పచ్చజెండా ఊపగానే బస్సులను ప్రారంభిస్తామని, ఇదే సమయంలో గ్రీన్ జోన్లలో ఆటోలు, క్యాబ్ లకు కూడా పరిమితులతో కూడిన అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

More Telugu News