Raithu Bharosa: ఏపీలో 'రైతు భరోసా' కానుక.. 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు నేడు నగదు బదిలీ

  • గత నెలలో రూ. 2 వేలు చొప్పున సాయం
  • 18 నుంచి మొదలుకానున్న విత్తనాల విక్రయం
  • నేడు మరో విడత బ్యాంకుల్లో జమ కానున్న నగదు
Raithu Bharosa Cash Deposit Today in AP

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 49,43,590 రైతు కుటుంబాలకు నేడు పండగే. 'వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్' పథకం కింద రైతుకు ప్రతి ఏడాది రూ. 13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. తొలివిడతలో భాగంగా గత నెలలో ఒక్కో కుటుంబానికి రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 875 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ క్రమంలో నేడు ప్రతి రైతు కుటుంబానికి రూ. 5,500 బ్యాంకుల్లో పడనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ. 7500 జమ చేసినట్టు అవుతుంది.

ఈ ఉదయం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో నగదు జమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది.

ఈ పథకాన్ని వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2019-20 రబీ సీజన్ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. గత సంవత్సరం 46.69 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు సహాయం అందింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు సైతం ప్రభుత్వం సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి విత్తనాల విక్రయం మొదలుకానున్న నేపథ్యంలో, రైతులకు విత్తనాల కొనుగోలుకు వీలు కల్పిస్తూ 15 నుంచే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

More Telugu News