Jagan: ప్రకాశం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీఎం జగన్

  • విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
  • విద్యుత్ తీగలు తెగిపడిన వైనం
  • విద్యుదాఘాతానికి గురైన కూలీలు
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఏపీ సీఎం
AP CM Jagan shocked after heard about accident in Prakasham district

ప్రకాశం జిల్లాలో  జరిగిన ఘోర దుర్ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పొలంలో పనిచేసి ఇంటికి వెళుతున్న మిర్చి కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. మిరప చేనులో పని పూర్తయిన తర్వాత ట్రాక్టర్ లో ఇంటికి వెళుతుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, తెగిన విద్యుత్ వైర్లు కూలీలపై పడ్డాయి. దాంతో 9 మంది కూలీలు, ఒక రైతు విద్యుదాఘాతంతో మరణించారు.

ఈ ఘటన గురించి అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. అటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతికి లోనయ్యారు.

కాగా, మృతుల్లో ఎక్కువ మంది మహిళా కూలీలే ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా జేసీ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలా మారింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News