Konaseema: కోనసీమలో దడ పుట్టిస్తున్న 'కోయంబేడు' లింక్!

Koyambed market effect on Konaseema
  • కోనసీమలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు
  • నలుగురు కోయంబేడు మార్కెట్ కు వెళ్ళొచ్చిన వైనం
  • భర్త నుంచి భార్యకు సోకిన కేసు మరొకటి
కోయంబేడు మార్కెట్. చెన్నైలో ఉన్న ఈ మార్కెట్ ఏపీలో కలకలం రేపుతోంది. అక్కడకు వెళ్లొచ్చిన వారు కరోనా బారిన పడుతుండటమే దీనికి కారణం. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ మార్కెట్ కారణంగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దీని ఎఫెక్ట్ జిల్లాలను దాటుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమను తాకింది. కోయంబేడు మార్కెట్ కు వెళ్లొచ్చిన పలువురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అమలాపురంలో రెండు పాజిటివ్ కేసులు తేలాయి. బండారులంకలో ఓ వ్యాన్ డ్రైవర్ కు పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆయన ద్వారా భార్యకు వైరస్ సోకింది.

మరోవైపు కొత్తపేట మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏనుగుల మహల్ కు చెందిన ఇద్దరికి, బోడిపాలెంకు చెందిన మరొక వ్యక్తికి పాజిటివ్ గా తేలింది. ఈ ముగ్గురు ఈ నెల 10న కోయంబేడు నుంచి రావులపాలెం చేరుకున్నారు. అయితే కరోనా అనుమానం రావడంతో ఇళ్లకు వెళ్లకుండా... కొత్తపేట సమీపంలో ఉన్న ఓ లంకలో తలదాచుకుని, అధికారులకు సమాచారాన్ని అందించారు. అధికారులు వీరికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, ప్రశాంతంగా ఉన్న కోనసీమలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.
Konaseema
Corona Virus
Koyambed Market

More Telugu News