తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి.. డెడ్ బాడీలకు కూడా కరోనా టెస్టులు చేయాలని ఆదేశం!

14-05-2020 Thu 15:22
  • మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు
  • హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
  • పరీక్షలు చేయకపోతే మూడో స్టేజికి చేరుకుంటామని ఆందోళన
Telangana High Court orders to conduct corona tests to dead bodies

మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డెడ్ బాడీలకు కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ... శవాలకు పరీక్షలు చేయకపోతే కరోనా కేసులు మూడో స్టేజికి చేరుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏపీలో చోటుచేసుకున్న ఘటనలను లాయర్ ప్రభాకర్ ఉటంకించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో చనిపోయిన తర్వాత డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తే కరోనా బయటపడిందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను హైకోర్టుకు అందించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ పాటిస్తోందో నివేదిక అందించాలని ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన సూచనలను పాటించాలని చెప్పింది. ఈ నెల 26న నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 26కు వాయిదా వేసింది.