Corona Virus: ప్రత్యేక రైళ్లు, శ్రామిక్‌ రైళ్లు మినహా.. జూన్‌ 30 వరకు చేసుకున్న అన్ని రైళ్ల రిజర్వేషన్లు రద్దు!

  • కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోతుండడంతో నిర్ణయం
  • లాక్‌డౌన్‌ ప్రత్యేక రైళ్లు, శ్రామిక్‌ రైళ్లు మాత్రమే నడపనున్న రైల్వేశాఖ
  • రిజర్వేషన్లు చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లిస్తామని ప్రకటన
Coronavirus Lockdown Train Tickets Cancelled Till June 30 Migrant Passenger Specials To Continue

కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోతుండడంతో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్యాసింజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్ వంటి అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ ప్రత్యేక రైళ్లు, శ్రామిక్‌ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు  రైల్వే శాఖ తెలిపింది.

మిగిలిన రైళ్లు ఏవీ తిరగవని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ లేక రైల్వే కౌంటర్లలో ఇప్పటికే ప్రయాణికులు రిజర్వేషన్లు చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో చెల్లించిన ప్రయాణికుల ఖాతాలకు తిరిగి ఆ డబ్బును జమ చేస్తున్నట్లు వివరించింది.

అలాగే, కౌంటర్‌లలో రిజర్వేషన్లు చేయించిన వారికి కూడా ఆన్‌లైన్‌లోని పలు రూపాల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 12 నుంచి కార్మికుల కోసం ప్రారంభమైన ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతామని వివరించింది.

ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రాంతాలకు ప్రారంభించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కి ముందు ట్రైన్లు బుక్‌ చేసుకున్న వారికి ఇప్పటికే రైల్వే శాఖ తిరిగి చెల్లింపులు చేసింది. మొత్తం 94 లక్షల టిక్కెట్లకు సంబంధించి రూ.1,490 కోట్లను తిరిగి ఇచ్చేసింది.

More Telugu News