Brazil: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విలయం.. మూడు లక్షలకు చేరువైన మరణాలు

  • ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది కరోనా బాధితులు
  • రష్యాలో కొత్తగా 10 వేల మందికి కరోనా
  • బ్రెజిల్‌లో ఒక్క రోజులోనే 881 మంది మృతి
Corona Deaths continues in world

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, దాదాపు మూడు లక్షల మంది మరణించారు. 16 లక్షల మందికిపైగా కోలుకున్నారు.

మరోవైపు, అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తుండడంపై అంటు వ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలను ఎత్తివేయడం తొందరపాటు చర్యే అవుతుందని, నియంత్రించలేని స్థాయికి వైరస్ చేరుకుంటుందని హెచ్చరించారు. కరోనాను అడ్డుకునే టీకా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫౌచీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రష్యాలో కొత్తగా పదివేల మందికి వైరస్  సోకింది. ఆఫ్రికాలోని లెసొథో దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది. హాంకాంగ్‌లో 24 రోజుల తర్వాత తొలి కేసు నమోదైంది. న్యూజిలాండ్‌లో వరుసగా రెండో రోజూ కేసులు నమోదు కాలేదు. స్పెయిన్‌ను మాత్రం వైరస్ వీడడం లేదు. అక్కడ గత 24 గంటల్లో 184 మంది చనిపోగా, 400 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ ఒక్క రోజులోనే ఏకంగా 881 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో అక్కడ మరణాల సంఖ్య 12 వేలకు పెరిగింది.

More Telugu News