Jagan: నీళ్లు లేని పరిస్థితి ఉంది.. మానవత్వంతో ఆలోచించండి: కృష్ణా జలాల వివాదంపై జగన్ స్పందన

  • రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది
  • ఏపీకి కేటాయించిన నీటినే మేము వాడుకుంటాం
  • అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నాం
Jagan response on Krishna water dispute

కృష్ణానది నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని... దీనిపై మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు.

ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకుంటామని జగన్ చెప్పారు. ఈ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లేందుకు కృష్ణా బోర్డు కూడా ఒప్పుకోదని తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామని చెప్పారు.

శ్రీశైలం డ్యాములో నీటిమట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు కూడా మించి ఉండదని చెప్పారు. ఆ 10 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నీటి మట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లలేదని చెప్పారు. శ్రీశైలం నీటిమట్టం 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి కేవలం వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే వెళ్తుందని తెలిపారు.

More Telugu News