Ajit Jogi: కోమాలో ఉన్న మాజీ సీఎంకు ఆడియో థెరపీ... ఇష్టమైన పాటలు వినిపిస్తున్న వైద్యులు

  • మే 9న అస్వస్థతకు గురైన అజిత్ జోగి
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిన మాజీ సీఎం
Doctors gives former chief minister Ajit Jogi audio therapy

చత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు. అజిత్ జోగి మే 9న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆపై ఆయన పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆయనలో చలనం లేదని, నాడీ వ్యవస్థ దాదాపు అచేతనంగా మారిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆడియో థెరపీ ఇస్తున్నారు. మాజీ సీఎంకు ఇష్టమైన పాటలను ఇయర్ ఫోన్స్ ద్వారా వినిపిస్తున్నారు.

ఇంతకీ అజిత్ జోగి అస్వస్థతకు ఓ చింతపిక్క కారణమని వైద్యులు చెబుతున్నారు. చింతపిక్క ఆయన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వివరించారు. అజిత్ జోగి మెదడును క్రియాశీలకంగా మార్చేందుకు ఆడియో థెరపీ ఇస్తున్నామని శ్రీ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఖేమ్కా వెల్లడించారు. ఆయనకు ఇష్టమైన పాటలను ఇయర్ ఫోన్స్ ద్వారా వినిపిస్తున్నామని, అయితే ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని తెలిపారు.

More Telugu News