Mike Tyson: ఓ స్వచ్ఛంద సంస్థ కోసం మళ్లీ బరిలో దిగుతున్న మైక్ టైసన్

  • 2005లో రిటైరైన టైసన్
  • 20 ఏళ్ల పిన్న వయసులోనే వరల్డ్ టైటిల్ కైవసం
  • కెరీర్ చివర్లో వివాదాలు
Boxing legend Mike Tyson returns for a cause

ప్రపంచ బాక్సింగ్ రంగంలో ఎంతోమంది వచ్చినా మైక్ టైసన్ కు వచ్చినంత ప్రాచుర్యం మరెవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థిని ఒక్క పంచ్ తో నాకౌట్ చేయగల పవర్ మైక్ టైసన్ సొంతం. 20 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ నెగ్గి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ అమెరికా జాతీయుడు ఆ తర్వాత ఎదురులేని ప్రస్థానం సాగించాడు. కెరీర్ చివర్లో అనేక వివాదాలు టైసన్ ప్రతిష్ఠను మసకబార్చినా, అతడి బాక్సింగ్ నైపుణ్యం, సాధించిన విజయాలు అభిమానులకు చిరస్మరణీయం.

2005లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి తప్పుకున్న టైసన్ మళ్లీ ఇన్నాళ్లకు రింగ్ లో దిగుతానని ప్రకటించాడు. అయితే ఈసారి ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరించేందుకు బాక్సింగ్ గ్లోవ్స్ ధరిస్తున్నానని వెల్లడించాడు. గతవారం టైసన్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. 53 ఏళ్ల వయసులోనూ తనలో పదును ఏమాత్రం తగ్గలేదని చెబుతూ విపరీతమైన వేగంతో పంచ్ లు విసురుతూ ఆ వీడియోలో దర్శనమిచ్చాడు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన మరో వీడియోలో వర్కౌట్లు చేస్తూ అభిమానులను అలరించాడు.

మైక్ టైసన్ బాక్సింగ్ నుంచి తప్పుకున్నాక గంజాయి వ్యాపారంలో ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో టైసన్ రాంచ్ పేరిట అతిపెద్ద గంజాయి వనం (ఎస్టేట్) టైసన్ సొంతం. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం చట్టబద్ధం అని తెలిసిందే. టైసన్ కు ఈ వ్యాపారం ద్వారా నెలకు 5 లక్షల పౌండ్ల మేర ఆదాయం వస్తున్నట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

More Telugu News