saudi: ప్రజలపై పన్ను ప్రభావం ప్రారంభం... సౌదీ అరేబియాలో పన్నులను మూడు రెట్లు పెంచిన వైనం

  • కీలక ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
  • సౌదీ యువరాజు కలల ప్రాజెక్ట్ 'విజన్ 2030' కూడా వాయిదా
  • రూ.1.97 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని భావిస్తోన్న సౌదీ
  • మొన్నటి వరకు వ్యాట్  5 శాతం.. ఇప్పుడు 15 శాతం
Saudi triples VAT rate

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు పన్నులు భారీగా పెంచే అవకాశం ఉందని, సామాన్యుడిపై భారం పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరించినట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల ప్రభుత్వ ఖజానాకు పడుతున్న గండి నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా పన్నును భారీగా పెంచిన తొలి దేశంగా సౌదీ అరేబియా నిలిచింది.

ముడి చమురు, మక్కా, మదీనా యాత్రికులపైనే అధికంగా ఆధారపడి బతికే ఆ దేశం కరోనా దెబ్బకు కుదేలు అవుతుండడంతో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కరోనాతో అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. దిగజారి పోతోన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రజలపై విధిస్తున్న పన్నులను సౌదీ అరేబియా ఒక్కసారిగా మూడు రెట్లు పెంచేసింది.

అంతేకాదు, కీలక ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సౌదీ యువరాజు బిన్ సల్మాన్ కలల ప్రాజెక్టయిన విజన్ 2030 కూడా వాయిదా పడడం గమనార్హం. దీంతో  రూ.1.97 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని సౌదీ అరేబియా ప్రభుత్వం భావిస్తోంది. మొన్నటి వరకు సౌదీలో వ్యాట్  5 శాతం ఉండేది. ఇప్పుడది 15 శాతానికి పెరిగింది.

కరోనా విజృంభిస్తూ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోన్న ఈ పరిస్థితుల్లో పన్ను భారం తప్పదంటూ  సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి అల్ జదాన్ ప్రకటించారు. సౌదీ సర్కారు ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 22 శాతానికి పడిపోయింది. దీని విలువ దాదాపు రూ. 68,300 కోట్లు ఉంటుంది.

కరోనా వల్ల 24 శాతం చమురు ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఈ లోటును పూడ్చుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో విదేశీ మారక నిల్వల నుంచి రూ.2,03,400 కోట్లను డ్రా చేసింది. 2019 డిసెంబరు వరకు సౌదీ సర్కారు వద్ద రూ.37,03,000 కోట్ల మేర విదేశీ మారక నిల్వలు ఉన్నాయి.

అయితే, 2021 డిసెంబరు లోపు అవి రూ. 28,45,500 కోట్లకు పడిపోయే సూచనలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కాగా, మక్కా, మదీనా వంటి యాత్రలను సౌదీలో పునరుద్ధరిస్తే మాత్రం ఈ పరిస్థితిలో కొంత మార్పు ఉండే చాన్స్ ఉందని చెబుతున్నారు. లాక్‌డౌన్ వల్ల సౌదీ అరేబియాలో నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.

More Telugu News