USA: చైనాపై మరో ఆరోపణ... వాక్సిన్ రీసెర్చ్ ని హ్యాక్ చేశారంటున్న అమెరికా!

  • ప్రభుత్వ ఆదేశాలతో హ్యాకర్ల ప్రయత్నం 
  • తాజా సైబర్ రిపోర్ట్ లో ఎఫ్బీఐ ఆరోపణ
  • నిరాధార ఆరోపణలన్న చైనా
USA Accuses china another time

కరోనా మహమ్మారి విజృంభించిన తరువాత, అత్యధికంగా నష్టపోయిన దేశాల్లో ఒకటైన అమెరికా, మరోమారు వైరస్ జన్మించిన చైనాపై విరుచుకుపడింది. ఇప్పటికే వైరస్ ల్యాబ్ నుంచి లీకైందని, ఆ సమాచారాన్ని తొక్కిపట్టి, ప్రపంచమంతా విస్తరించేందుకు కారణమైందని ఆరోపించిన అమెరికా, తాజాగా, తాము చేస్తున్న వైరస్ రీసెర్చ్ ప్రక్రియను చైనా హ్యాక్ చేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు సైబర్ నివేదికలు విడుదలయ్యాయి.

ఎన్నో దేశాలు కరోనా వాక్సిన్ తయారీలో పోటీ పడుతుండగా, ఎంతో విలువైన రీసెర్చ్ ని దొంగిలించేందుకు చైనా హాకర్లు ప్రయత్నిస్తున్నారని, తమ అధ్యయనంలో వెల్లడైనట్టు ఎఫ్బీఐ, సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడ్డారు. ఈ హాకర్లు చైనా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, అతి త్వరలోనే ఈ వ్యవహారాన్ని ఆధారాలతో బయట పెడతామని, అధికారిక ప్రకటననూ వెలువరిస్తామని పేర్కొంది.

కాగా, అమెరికా తాజా ఆరోపణలను చైనా ఖండించింది. ఏ దేశంలోనైనా సైబర్ దాడులను తాము వ్యతిరేకిస్తామని, టీకా పరిశోధనలను, కరోనా చికిత్సా విధానం విషయంలోనూ ప్రపంచాన్ని చైనా నడిపిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఈ తరహా ఆరోపణలు సృష్టించడం అనైతికమని మండిపడ్డారు.

More Telugu News