kerala: కరోనాను ఎలా అణిచారో కాస్త మాకూ చెప్పండి: కేరళను కోరిన కర్ణాటక

  • కరోనా కట్టడి విషయంలో ఆదర్శంగా నిలిచిన కేరళ
  • ప్రస్తుతం కేవలం 27 మందికి మాత్రమే చికిత్స
  • అక్కడి విధివిధానాలను అడిగి తెలుసుకున్న కర్ణాటక ఆరోగ్య మంత్రి
Karnataka wants Kerala Help to Control Corona

మార్చి నెలాఖరు నాటికి దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా ఉన్న కేరళ, ఆపై అద్భుతంగా వైరస్ ను కట్టడి చేసి, ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఇతర ప్రాంతాల్లో కేసుల సంఖ్య వందలు, వేలు దాటుతున్నా, కేరళ మాత్రం అనూహ్యంగా వైరస్ ప్రబలకుండా చేయడంలో విజయవంతమైంది. గడచిన నెల రోజుల్లో ఆ రాష్ట్రంలో 150 కేసులు కూడా నమోదు కాలేదు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకూ 520 కేసులు రాగా, 489 మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. 27 మందికి చికిత్స జరుగుతోంది. కేవలం నలుగురు మాత్రమే మరణించారు.

ఈ నేపథ్యంలో కరోనా కట్టడి విషయంలో కేరళను ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్న కర్ణాటక ప్రభుత్వం, అందుకు మార్గనిర్దేశం చేయాలని కోరింది. కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజతో కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

"కొవిడ్-19ను అణచివేయడంలో కేరళ అందరికీ ఆదర్శంగా నిలిచిందని మనందరికీ తెలుసు. వారి చర్యలు నన్నెంతో ఆకర్షించాయి. అందుకే నేను కేరళ వైద్య మంత్రితో వీడియో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వారు పాటించిన విధానాలను అర్థం చేసుకోవాలని భావించాను. ఆమె వెంటనే అంగీకరించి, నాతో మాట్లాడారు. మా సమావేశం సత్ఫలితాలను అందిస్తుందని భావిస్తున్నాను. గతంలో నిఫా వైరస్ వంటి మహమ్మారులను కూడా కేరళ జయించింది. వారు పాటిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నాను" అని సుధాకర్ ఈ సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు.

కేరళలో రోగులు తమలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆసుపత్రులకు వచ్చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ కర్ణాటకలో అటువంటిది జరగడం లేదు. అందుకే మరణాలు సంభవిస్తున్నాయి. వ్యాధి ముదిరిన తరువాత మాత్రమే రోజులు ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో వారి ప్రాణాలను కాపాడలేకపోతున్నామని మంత్రి సుధాకర్ వ్యాఖ్యానించారు. రోగుల ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ తదితరాలపై శైలజతో తాను మాట్లాడినట్టు మంత్రి తెలిపారు.

కాగా, ప్రస్తుతం కర్ణాటకలో 860కి పైగా కరోనా కేసులుండగా, 31 మంది ఇప్పటివరకూ మృత్యువాతపడ్డారు. ప్రజారోగ్యం అనేది రాజకీయాలకు అతీతమే అయినప్పటికీ, బీజేపీ మంత్రి ఒకరు పక్క రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వ మంత్రితో ఇలా ఊహించని విధంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

More Telugu News