Speciao Trains: ప్రత్యేక రైళ్లలో రాజధాని ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేయాలని కేంద్ర నిర్ణయం

  • రేపటి నుంచి ప్రత్యేక రైళ్లు
  • ఢిల్లీ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రాకపోకలు 
  • వివరాలు వెల్లడించిన రైల్వే శాఖ
Indian Railways decides Rajdhani express charges on special trains

కేంద్రం ఒక్కొక్కటిగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తోంది. తాజాగా, రేపటి నుంచి ప్రయాణికుల రైళ్లు నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించనున్నాయి. అయితే, ఈ రైళ్లలో రాజధాని ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. టికెట్లను ఐఆర్ సీటీసీ వెబ్ సైట్లోనే బుక్ చేసుకోవాలని, ఐఆర్ సీటీసీ ఏజెంట్ల ద్వారా బుకింగ్ లకు అనుమతులు లేవని రైల్వే శాఖ వెల్లడించింది.

ప్రస్తుతానికి ఏడు రోజుల ముందస్తు రిజర్వేషన్ కు మాత్రమే అనుమతించామని తెలిపింది. ఖరారైన టికెట్లు మాత్రమే జారీచేస్తారని, వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ, తత్కాల్, కరెంట్ బుకింగ్ ఉండవని వివరించింది. టికెట్ల రద్దు కూడా ఆన్ లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. క్యాటరింగ్ ధరలను టికెట్ల చార్జీల్లో కలపడంలేదని, ఆహారాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని ఐఆర్ సీటీసీ కల్పిస్తోందని పేర్కొంది.

ఈ ప్రత్యేక రైళ్లలో దుప్పట్లు, తువ్వాళ్లు ఇవ్వట్లేదని తెలిపింది. ఆయా రైళ్లలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయని వివరించింది. అంతేకాకుండా, ప్రత్యేక రైళ్ల రాకపోకలు ప్రారంభం అవుతున్న దరిమిలా అన్ని స్టేషన్లలో సదుపాయాలు కల్పించాలంటూ జోనల్ మేనేజర్లు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే బోర్టు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News