Jagan: ఈ ఘటన భోపాల్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది.. కఠిన చర్యలు తీసుకోండి: జగన్ కు కన్నా లేఖ

  • విష వాయువు పీల్చిన వారు జీవితాంతం బాధపడతారు
  • కరెంటు శ్లాబుల మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
  • కరోనా సంక్షోభ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టద్దు
Vizag gas leak reminded Bhopal incident says Kanna Lakshminarayana

విశాఖలో పలువురు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విషాదకర ఘటనకు సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.

ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని... వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన భోపాల్ గ్యాస్ విషాదాన్ని గుర్తుకు తెచ్చిందని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక యువత, పోలీసులు స్పందించడంతో మరణాల సంఖ్య తగ్గిందని అన్నారు.

విష వాయువు పీల్చిన వారు జీవితాంతం ఆరోగ్య సమస్యలతో బాధ పడతారని కన్నా చెప్పారు. గ్యాస్ లీకేజీ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... లేకపోతే ఇలాంటి ఘటనలు మరెన్నో జరుగుతాయని అన్నారు.

కరెంటు ఛార్జీల శ్లాబుల్లో మార్పుపై కూడా జగన్ కు కన్నా మరో లేఖ రాశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ప్రజలకు సంపాదన లేదని... ఇలాంటి సమయంలో అధిక బిల్లులు వేసి, చెల్లించాలనడం మానవత్వం కాదని చెప్పారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

More Telugu News