ICMR: దేనిని కొవిడ్-19 మరణంగా పరిగణించాలి? అన్న విషయంలో క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్

ICMR clarifies what is a corona death
  • కరోనా మరణాలపై అధికారుల్లో సందిగ్ధత
  • అధికారులకు ప్రామాణికాలు జారీచేసిన ఐసీఎంఆర్
  • ఇతర వ్యాధులు ఉన్నవారిని కూడా పర్యవేక్షించాలని సూచన
కరోనా సోకినవారు ఇతర వ్యాధులతో మరణించినప్పుడు దాన్ని కరోనా మరణంగా పరిగణించాలా, వద్దా అనేది ఇప్పటికీ అధికారుల్లో సందిగ్ధంగానే ఉంది. దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టత ఇచ్చింది. కరోనా రోగులు న్యుమోనియా, రక్తం గడ్డకట్టడం, హార్ట్ అటాక్ వంటి లక్షణాలతో మరణించినప్పుడే దాన్ని కరోనా మరణంగా పరిగణించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, మరికొన్ని సమయాల్లోనూ కరోనా మరణాల పరిగణనపై వివరాలు తెలిపింది.

కరోనా టెస్టు ఫలితాలపై అనిశ్చితి ఏర్పడి, రోగిలో లక్షణాలు ఉంటే దాన్ని 'బహుశా కరోనా మరణం'గా నమోదు చేయాలని, ఒకవేళ పరీక్ష ఫలితాలు ఆలస్యం అయిన పరిస్థితుల్లో... లక్షణాలు కనిపిస్తే 'కరోనా అనుమానిత మృతి'గా పరిగణించాలని తెలిపింది. అలాకాకుండా, కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినా, లక్షణాలు కనిపిస్తే దాన్ని 'క్లినికల్లీ ఎపిడెమిలాజికల్లీ కరోనా మరణం'గా భావించాలని సూచించింది.

ఉబ్బసం, గుండెజబ్బులు, బ్రాంకైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు కరోనా మూలకారణాల కిందికి రావని, రోగుల్లో ఎన్ని లక్షణాలు ఉన్నా మూల కారణాలతో సంభవించిన మరణాలనే కరోనా మరణాలుగా నమోదు చేయాలని వివరించింది.  దేశంలో ఇతర వ్యాధులు ఉన్నవారిని కూడా పర్యవేక్షించాలని, ప్రజల ఆరోగ్య అవసరాలకు తగిన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐసీఎంఆర్ సూచించింది.
ICMR
Corona Death
Corona Virus
COVID-19
India

More Telugu News