Narendra Modi: నేటి ప్రధాని సమావేశంలో ముఖ్యమంత్రులందరికీ మాట్లాడే అవకాశం!

  • మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం
  • ఐదోసారి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్న మోదీ
  • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
All CMs will speak in todays Meeting with Modi

ఈ నెల 17 తరువాత లాక్ డౌన్ కొనసాగింపు, విధివిధానాలపై నేడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను ప్రధాని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుండగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నారు.

దీంతో ఈ సమావేశం సుదీర్ఘంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ఇండియాలో వ్యాపించడం ప్రారంభించిన తరువాత, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి. గడచిన నాలుగు సమావేశాల్లోనూ ఎంపిక చేసిన కొందరినే మాట్లాడేందుకు అనుమతించారు. ఈ దఫా మాత్రం అందరికీ మాట్లాడే అవకాశం లభించనుంది.

ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం, బస్సులు, లాక్ డౌన్ తదుపరి దశలో తీసుకోవాల్సిన చర్యలు, మరిన్ని రంగాలకు మినహాయింపులు, రాష్ట్రాల స్థాయిలో కేసుల పరిస్థితి తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నారు. వలస కార్మికుల తరలింపు అంశంపైనా సీఎంలు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ గురించి కూడా చర్చించవచ్చని సమాచారం. ఇదిలావుండగా, కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల్లో పరిస్థితి, ఆయా రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలను ఈ సమావేశం తరువాత కేంద్రం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News