China: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌తో జిన్‌ పింగ్ ఫోనులో మాట్లాడారన్న జర్మనీ పత్రిక.. నిజం కాదంటోన్న డబ్ల్యూహెచ్‌ఓ

  • జిన్‌పింగ్‌ ఒత్తిడి చేశారన్న జర్మనీ పత్రిక
  • అందుకే కరోనా‌పై అప్రమత్తం చేయడంలో ఆలస్యమైందని కథనం
  • ఆ కథనం నిరాధారమంటోన్న డబ్ల్యూహెచ్‌ఓ
  • జనవరి 21న ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని వ్యాఖ్య
who on china issue

కరోనా నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో తమ సంస్థ చీఫ్ రహస్యంగా ఫోనులో మాట్లాడారని వస్తోన్న ఆరోపణలను  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కొట్టిపారేసింది. కరోనా గురించి నిజాలు చెప్పకుండా చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహరించిందని అమెరికాతో పాటు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే.

జిన్‌పింగ్‌ ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ కరోనా వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ఆలస్యం చేసిందని జర్మనీకి చెందిన ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. జనవరి 21న ఫోనులో అధనోమ్‌తో జిన్‌పింగ్‌ ఫోన్‌ సంభాషణ జరిపిన ఆధారాలు జర్మనీ విదేశీ నిఘా సంస్థల వద్ద ఉన్నట్లు ఆ పత్రిక తెలిపింది. వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడానికి ఇంకొన్ని రోజులు వేచిచూడాలని ఆయనను జిన్ ‌పింగ్‌ కోరినట్లు ఆ కథనంలో చెప్పింది.

కరోనా విషయంలో చైనా వల్ల అప్పటికే ఆరు వారాల కీలక సమయం గడిచిపోయిందని ఆ పత్రికలో కథనాలు వచ్చాయి. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ స్పందిస్తూ..  జర్మనీ పత్రిక‌లో ప్రచురితమైన కథనం నిరాధారమని తెలిపారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని, జిన్‌పింగ్‌, సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ మధ్య జనవరి 21న ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని తెలిపింది.

అంతేగాక, జిన్‌పింగ్‌తో అధనోమ్‌ ఫోన్‌ ద్వారా ఎన్నడూ  మాట్లాడలేదని చెప్పింది. ఇటువంటి నిరాధార ఆరోపణలతో కరోనాపై ప్రపంచ దేశాలతో కలిసి సంస్థ చేస్తున్న పోరాటానికి అడ్డంకులు వస్తాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 20న ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందని చైనా సమాచారం అందించిందని చెప్పింది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న అనంతరం రెండు రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపిందని వివరించింది.

More Telugu News